NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుండె స‌మ‌స్యకు ఆల్కహాల్‌తో చికిత్స‌!

1 min read

కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో అరుదైన వైద్యం

40 ఏళ్ల రైతుకు గ‌ట్టిబ‌డిన గుండె కండ‌రాలు

ఫ‌లితంగా త‌గ్గిపోయిన ర‌క్త స‌ర‌ఫ‌రా

ఏఎస్ఏ చికిత్సతో న‌యం చేసిన డాక్టర్ ప్రదీప్ కృష్ణ‌

అనంత‌పురం, న్యూస్​ నేడు : ఆయాసం, గుండెద‌డ‌, ఛాతీలో నొప్పి, క‌ళ్లు తిర‌గ‌డం లాంటి మామూలు ల‌క్షణాల‌తో వ‌చ్చిన ఒక రైతుకు.. అసాధార‌ణం, అత్యంత అరుదైన స‌మ‌స్య ఉంద‌ని గుర్తించిన అనంత‌పురం కిమ్స్ స‌వీరా ఆస్పత్రి వైద్యులు.. శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా న‌యం చేసి పంపారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను చికిత్స అందించిన క‌న్సల్టెంట్ ఇంట‌ర్వెన్షన‌ల్ కార్డియాల‌జిస్ట్ డాక్టర్ జి.ప్రదీప్ కృష్ణ తెలిపారు. “తాడిప‌త్రి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రైతు త‌ర‌చు ఆయాసం, గుండెద‌డ‌, ఛాతీలో నొప్పి, క‌ళ్లు తిర‌గ‌డం లాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ వ‌చ్చారు. ఆయ‌న‌కు త‌గిన ప‌రీక్షలు చేస్తే ఆయ‌న అత్యంత అరుదైన హైప‌ర్‌ట్రోఫిక్ అబ్‌స్ట్రక్టివ్ కార్డియోమ‌యోప‌తి (హెచ్ఓసీఎం) అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్లు తెలిసింది. ఇది ప్రతి వెయ్యిమందిలో ఇద్దరికి మాత్రమే క‌నిపిస్తుంది. దీనికి ముందుగా కొన్ని మందులు వాడినా త‌గ్గక‌పోవ‌డంతో ఆయ‌న గుండె విఫ‌ల‌మ‌య్యే ప‌రిస్థితి కూడా ఏర్పడింది. దాంతో ఆయ‌న‌కు ఆల్క‌హాల్ సెప్టల్ అబ్లేష‌న్ (ఏఎస్ఏ) అనే చికిత్స చేయాల‌ని నిర్ణయించాం. హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది గుండె కండరాలు లేదా మయోకార్డియం మందంగా మారడంతో గుండె కింది భాగంలో దృఢత్వం కారణంగా మిట్రల్ వాల్వ్‌లో మార్పులకు కారణమయ్యే సంక్లిష్టమైన గుండె వ్యాధి. దీనివ‌ల్ల గుండె కింద భాగం పరిమాణం పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అవయవాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఇది ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైనది. ఈ సమస్య జన్యు పరివర్తన వల్లే సంభవిస్తుంది. గుండె కండ‌రాలు అసాధార‌ణంగా గ‌ట్టిబ‌డిపోయి గుండె నుంచి శ‌రీర భాగాల‌కు వెళ్లే ర‌క్తస‌ర‌ఫ‌రా నిలిచిపోతుంది. ఇది అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది. ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్ (ASA) అనేది హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతికి శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా చేయ‌గ‌లిగే చికిత్స‌. ఈ వ్యాధి వ‌ల్ల గుండె కండరాలు పెద్దవి అవుతాయి. గుండె కింద ఎడమ భాగం నుంచి రక్తం బయటకు రావడాన్ని అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియ కోసం, సెప్టల్ పెర్ఫొరేటర్స్ అని పిలిచే గుండె రక్త నాళాలలోకి ఆల్కహాల్ ఇంజెక్ట్ చేయడానికి కాథెటర్‌ను ఉపయోగిస్తారు. విస్తరించిన కణజాలాన్ని ఆల్కహాల్ కుదించి, వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎలా గుర్తించాలి?

హెచ్‌సీఎంను గుర్తించ‌డానికి ఎకోకార్డియోగ్రామ్ అనేది ప్రాథ‌మిక ప‌రీక్ష‌. గుండె కండరాలు గట్టిపడటం, రక్త ప్రవాహానికి ఏదైనా అడ్డంకి ఉంటే దాని పరిధిఎంతో దీంతో తెలుస్తుంది. త‌ర్వాత కార్డియాక్ ఎంఆర్ఐ ద్వారా గుండె నిర్మాణాన్నిపూర్తిగా తెలుసుకోవ‌చ్చు. కండ‌రాలు ఎంత‌మేర గ‌ట్టిబ‌డ్డాయో క‌చ్చిత‌మైన అంచ‌నా వ‌స్తుంది. సాధార‌ణంగా జ‌న్యు ఉత్పరివ‌ర్తనాల వ‌ల్లే ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది కాబట్టి ఇందుకు సంబంధించిన  జ‌న్యు ప‌రీక్షలు కూడా చేస్తారు. కుటుంబంలో ఒక‌రికి ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు మిగిలినవారు కూడా ఈ ప‌రీక్షలు చేయించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఒకే త‌ర‌హా జ‌న్యువులు ఉండ‌డంతో వారికి కూడా వ‌చ్చే ప్రమాదం ఉంటుంది. ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా ముందుగా తెలుసుకుంటే సుల‌భంగా న‌యం చేసుకోవ‌చ్చు” అని డాక్టర్ ప్రదీప్ కృష్ణ వివ‌రించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *