రాయలసీమలో అభివృద్ధి, సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలి
1 min read
రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలి.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలి.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు.
న్యూస్ నేడు నంద్యాల ప్రతినిధి: రాయలసీమలో అభివృద్ధి, సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్. రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబాఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దశ, దిశను ఈ మహానాడులో ప్రకటించాలని అన్నారు. అలాగే మహానాడులో రాయలసీమకు నీటి వనరులు అందించే హంద్రీ – నీవా,గాలేరు – నగరి, సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు. అలాగే సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజలతో మమేకమయ్యేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిపిఐ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకోసారి రాష్ట్ర మహాసభలను జరుపుకుంటుందని, అందులో భాగంగా ఆగస్టు 22 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, అలాగే జాతీయ మహాసభలు చండీగఢ్ లో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.ముచ్చటగా మూడవసారి గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీలను భయపెట్టి లొంగ దీసుకుంటున్నారని ఆరోపించారు. 2014 నుండి నేటి వరకు ప్రజలను మభ్యపెట్టి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని ఆరోపించారు. గత వైకాపా ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టులో వారి నాయకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేసి అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయేలా చేశారని ఆరోపించారు. వాటి పునర్నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పహల్గాంలో తీవ్రవాదులు దాడి చేసి ఇన్ని రోజులైనా ఆ తీవ్రవాదులను పట్టుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినందువల్లే యుద్ధం నిలిపివేశారని, ట్రంప్ కుమారులేమో పాకిస్తాన్ తో చేతులు కలిపి వేలకోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహానాడులో జరుగుతున్న కడపలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కడపలో స్టీల్ ప్లాంట్ ను నిర్మించాలని, వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని తీర్మానించాలని ఆయన కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో నిలిపివేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని, బెంగళూరు-హుబ్లీ, కర్నూల్ నుండి ప్రస్తుత రాజధాని విజయవాడకు రైళ్ళను నడపాలని, గతంలో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు పలు వినతులు ఇచ్చామని, కేంద్రం రైల్వే శాఖ ద్వారా రైళ్లను పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు.