PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా.. : టి.జి వెంకటేష్

1 min read

ఆర్యవైశ్యులంతా ఆలోచించి సరైన నేతను ఎన్నుకోవాలి… టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్​:ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. ఆదివారం నగరశివారులోని డోన్ రోడ్డులో ఉన్న గాయత్రీ గోశాలలో కార్తీకమాస వనభోజన మహోత్సవం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి.జి వెంకటేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆర్యవైశ్యులందరికీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన మంతా ఒకే కుటుంబమని.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. ఏపీ, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుండి ఎంతో మంది ఆర్యవైశ్యులు తమ సమస్యలు తనకు తెలుపుతుంటారని.. వాటిని పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తుంటానన్నారు. యువత ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్ ఆర్యవైశ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. ముక్కోటి దేవతలు కొలువుండే గోశాలలో ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించుకోవడం మనందరి అద్రుష్టమన్నారు. 18 ఆర్యవైశ్య ఆర్గనైజేషన్లను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక ఆర్యవైశ్యులంతా ప్రజలకు మేలు చేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని.. ఎన్నికల సమయంలో తరలివచ్చి మంచి నాయకుడికి ఓటు వేయాలన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఇబ్బందులు పడతామన్నారు. ఆర్యవైశ్యుల ఓటింగ్ శాతం పెంచాలన్నారు. అనంతరం సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్యులుగా పుట్టడం మన అద్రుష్టమన్నారు. ప్రజాసేవ చేయడం టిజి కుటుంబానికే సాధ్యమైందన్నారు. అడిగిన వారికి కాదనకుండా టిజి భరత్ సహాయం చేస్తున్నారన్నారు. ఇలాంటి టిజి భరత్ ను మనం ఆదరించాలన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా ఆయన్ను మనం ఆశీర్వదించి గెలిపించాలన్నారు. కర్నూలు డెవలప్మెంట్ కావాలంటే భరత్ ఎమ్మెల్యే అవ్వాలన్నారు. కార్తీక వనభోజనాల సందర్భంగా ఆటల పోటీలు, సాంసక్రుతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 18 ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, సభ్యులు, ఆర్యవైశ్య పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏడు వేల మందికిపైగా ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

About Author