మహిళలు అన్ని రంగాలలో పురుషులకంటే అధికంగా రాణిస్తున్నారు
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
మహిళలకు విద్య ఎంతో దోహదపడుతుంది
ఏపీ ఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. . అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక గిరిజన భవన్ లో శనివారం సాయంత్రం ఏ.పి ఎన్జీవోస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా రాణిస్తారన్నారు. మహిళలు పురుషులతో దేంట్లోనూ తీసిపోరని,ప్రోత్సాహం, అవకాశం, చేయూత అందిస్తే పురుషులకంటే ఎక్కువుగా తమ సత్తా చూపుతారన్నారు. మహిళాభివృద్దికి విద్య ఎంతో ముఖ్యమని, కుటుంబంలో ఒక మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ప్రతీ ఇంట్లో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ మహిళా విద్యావంతురాలైతే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు పురుషులకు ఏ విషయంలో కూడా తీసిపోరని, అన్ని రంగాలలో పురుషులకంటే మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారన్నారు. మహిళల సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేయూతను ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ప్రగతిపధంలో నడవాలన్నారు. మన దేశానికీ చెందిన మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమసత్తాను చాటి,మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ మహిళా తనకు అభిరుచి ఉన్న రంగంలో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని, అందుకు తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన మహిళలకు బహుమతులను వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగినులకు మెమొంటోలను కలెక్టర్ బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, ఐసిడిఎస్ పీడీ పి.శారద,ఏ.పి. ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్,కార్యదర్శి నెరుసు. వెంకటరామారావు, ఏ.పి.ఎన్జీవోస్ నాయకులు హరనాథ్, వివిధ శాఖల మహిళఉద్యోగినులు పాల్గొన్నారు.

