బాధితులను పరామర్శించిన యువజన కాంగ్రెస్ నాయకులు
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా, పోలవరం నియామకవర్గం ప్రాంతంలోని గోల్లగుప్ప గ్రామంలో మాలేరియా నివారణ చర్యల్లో భాగంగా క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న అనంతరం 7 ఏళ్ల గిరిజన బాలిక మాధవి జమున మృతి చెందడం,మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పట్ల యువజన కాంగ్రెస్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ఘటన నేపథ్యంలో ఏలూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామ సూరి రెడ్డి, ఏలూరు సిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బురదగుంట లెవిన్ క్రిస్టియన్, యువజన కాంగ్రెస్ సభ్యులు కప్పల చిన్నబాబు, బురదగుంట హేమంత్ కుమార్ బాధితులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ వాడే రఘుబాబు, జిల్లా ఎస్ టి సెల్ వైస్ ప్రెసిడెంట్ పొదెం వీరయ్య, కుప్పనూరు మండల వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి సత్యనారాయణ పాల్గొన్నారు.బాధిత పిల్లలు, వారి తల్లిదండ్రులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందుల మోతాదు ఎక్కువై ఉండవచ్చనే అనుమానాన్ని కొందరు తల్లిదండ్రులు వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే ఘటనకు అసలు కారణం అధికారిక విచారణలో తేలాల్సి ఉందన్నారు.అనారోగ్యంతో ఉన్న చిన్నారులను పరామర్శించి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు పండ్లు మరియు మంచినీరు పంపిణీ చేశారు. 7 ఏళ్ల గిరిజన బాలిక మాధవి జమున మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై ప్రభుత్వం పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరిపి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.మందుల నాణ్యత, మందుల మోతాదు, పంపిణీ విధానం తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి, నిర్లక్ష్యం లేదా లోపం ఏదైనా తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పేద ప్రజల సమస్యలపై యువజన కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుందని వారు స్పష్టం చేశారు. మాధవి జమున కుటుంబానికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


