పత్తికొండ అంగన్వాడీ కేంద్రాలలో అవకతవకలపై విచారణ చేపట్టండి ..బీజేపీ
1 min read
జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు బీజేపీ వినతిపత్రం అందజేత
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని బిజెపి నాయకులు ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండ మండలంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలు, నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్,(PD)విజయ గారికి వివరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ నాయకత్వం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పత్తికొండ మండలంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలు దాదాపు గత 5 నెలల నుంచి నిర్దిష్ట సమయాలకు తెరవడం లేదని, కేంద్రాల్లో టీచర్లు లేకుండా ఆయాలకే బాధ్యతలు అప్పగించి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న బాల సంజీవని కిట్టు, బాలామృతం, అన్ని రకాల పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ కావడం లేదని, రికార్డుల్లో తారు మారులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అలాగే కొంతమంది అంగన్వాడీ సిబ్బంది విధులను పక్కనపెట్టి, సెలవులు పెట్టకుండా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, సూపర్వైజర్లు మరియు సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని అందుకే కిందిస్థాయి సిబ్బంది నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మార్వో కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.అంగన్వాడీ కేంద్రాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ .

