ఈనెల 30 లోగా ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయలి
1 min read
జాప్యం చేసినఅధికారులు,సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు
టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 1వ తేదీ నుండి 30వ తేదీ లోగా ఇండ్లగణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇండ్లగణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి, మే, 30వ తేదీలోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని మండలాల్లో ఒక ఎన్యూమరేటర్ కు తాను గణన చేసే గ్రామంతో పాటు అదనంగా మరో ఒకటి, రెండు గ్రామాలలో గణన కు కేటాయించారన్నారు. దీని కారణంగా లక్ష్యాలు పూర్తికావని, అదనంగా కేటాయించిన గ్రామాలను వారి నుండి రద్దు చేసి వేరే వారికి గణన విధులు కేటాయించాలన్నారు. తహసీల్దార్లు, డివిజన్ స్థాయి అధికారులు వారి పరిధిలో ఎన్యూమరేటర్లు వారికి కేటాయించిన రోజు వారీ ప్రగతిని సాధించారా, లేదా అనే విషయాన్నీ ప్రతీ రోజూ సమీక్షించుకోవాలని,లక్ష్యాలలో వెనుకబడిన సిబ్బంది కారణాలు తెలుసుకుని ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా: ఎం.జె. అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు కిషోర్,రమణ, మండలాల తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.

