రైతన్నల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: రైతన్నల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పత్తికొండ శాసనసభ్యులు కేఏ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల్లో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దుతూ, పూర్తి పారదర్శకతతో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తోందన్నారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాల ఆధారంగానే ఎటువంటి పొరపాట్లు లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని తెలిపారు.రైతుల ఇళ్ల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్లి పాస్ పుస్తకాలను అందజేస్తారని, పంపిణీ సమయంలో రైతుల వేలిముద్ర తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో నిర్వహించిన రీసర్వే ప్రక్రియ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూహక్కు పత్రాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు.ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం రైతుల గౌరవాన్ని కాపాడుతూ, రాజముద్ర మరియు క్యూఆర్ కోడ్‌తో కూడిన భద్రతా ప్రమాణాలున్న పాస్ పుస్తకాలను అందజేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నామని, గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు.

