మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
1 min read
గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా ప్రతినిధి అంటే ఒక హోదా మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన ప్రజా సేవ అని నిరూపించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో దెందులూరు మండలం, గంగన్నగూడెంలో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి ఏలూరు వస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సోమవరప్పాడు గ్రామం వద్ద రోడ్డుపై పడిపోయి కనిపించిన ద్విచక్ర వాహనదారుని చూసి వాహనాన్ని ఆపారు. అతని వద్దకు వెళ్లి, అప్పటికే అక్కడ గుమిగూడిన వారిని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ముందుగా రోడ్డు ప్రమాదం గా భావించినా, అక్కడ రక్తపు మరకలేవీ కనిపించలేదు. కానీ అంబులెన్స్ వచ్చేవరకూ ఆగితే ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం అని భావించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఫిట్స్ తో గిలగిలా కొట్టుకుంటున్న ఆ వ్యక్తిని తన వాహనంలో ఎక్కించి, తన సిబ్బందిని తోడుగా ఇచ్చి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రికి ఫోన్ చేసి సమాచారం అందించి, వేగంగా మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఎంపీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిన వైద్య సిబ్బంది,ఎంపీ వాహనం ఆసుపత్రికి చేరగానే బాధితుడిని లోపలికి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయగా,అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు తేలింది. ఫిట్స్ తోపాటు గుండెపోటు రావడంతో మార్గ మధ్యలోనే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. చనిపోయిన వ్యక్తితో పాటు ఉన్న రెండవ వ్యక్తి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి పేరు గంటా సుబ్బారావు, ఏలూరు శివారు, పతేబాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. వయసు సుమారు 60 సం. ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా పక్కనే ఒక మనిషి చనిపోతున్నా పట్టించుకొనే నేటి రోజుల్లో రాత్రి సమయంలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఏలూరు ఎంపీ చొరవకు, మానవతా దృష్టితో సాయం అందించిన ఎంపీ కి అక్కడ వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు.

