NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి స్ఫూర్తితో ఇంధన పొదుపు దిశగా దెందులూరు ఎమ్మెల్యే

1 min read

స్వచ్ఛందంగా తన కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకున్న ఎమ్మెల్యే

ప్రజల కోసం తన ఇష్టమైన మోడిఫైడ్ కారును సైతం పక్కనపెట్టి,సాధారణ స్పేర్ కారులో పర్యటన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో భాగంగా ఇప్పటికే సీఎం తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోగా,అదే బాటలో దెందులూరు శాసనసభ్యులు  చింతమనేని ప్రభాకర్ పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇష్టమైన కారును పక్కనపెట్టి

గతేడాది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంతో ఇష్టపడి మోడిఫై చేయించుకున్న టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ కారు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నేటి అత్యవసర పరిస్థితుల్లో ఇంధన పొదుపు మంత్రాన్ని పాటించాలని నిర్ణయించుకున్న ఆయన,

ఆ మూడిఫైడ్ కారును సైతం పక్కనపెట్టారు. గురువారం ఉదయం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో నిత్య ప్రజా దర్బార్ కార్యక్రమం ముగిసిన అనంతరం క్యాంపు కార్యాలయం  నుండి నియోజకవర్గ అధికారిక పర్యటనలకు బయలుదేరిన ఎమ్మెల్యే తన వ్యక్తిగత సిబ్బంది కోసం కేటాయించిన స్పేర్ కారులో సిబ్బంది అందరితో కలిసి ఒకే వాహనంలో వెళ్లడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

సంస్కరణల అమలులో ముందు వరుసలో

ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీ కార్యక్రమాలను, సంస్కరణలను అమలు చేయడంలో చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ ముందుంటారు. నాయకుడు అంటే చెప్పడం కాదు.చేసి చూపించాలి అనే సూత్రాన్ని పాటిస్తూ, ఇంధన కొరతను అధిగమించేందుకు కాన్వాయ్ వాహనాలను తగ్గించుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనా, ఇటువంటి పొదుపు చర్యలైనా ఆయన తీసుకునే చొరవ నియోజకవర్గ ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తోంది.

నియోజకవర్గ ప్రజలకు పిలుపు: ఎమ్మెల్యే ఈ వినూత్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఇంధనాన్ని ఆదా చేస్తూ దేశ ప్రయోజనాల్లో భాగస్వాములు కావాలని కూటమి నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *