NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్య ద్వారానే భవిష్యత్ తరాలను మార్చగలం

1 min read

– విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

ఆడపిల్లల విద్యకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శాలువాతో సన్మానం చేసి మెడల్స్, ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: ఆడపిల్లల విద్యకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, విద్య ద్వారానే కుటుంబాలతో పాటు భవిష్యత్ తరాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో లక్ష్యాల వైపు ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్  అభినందించి, శాలువాలతో సన్మానించి, మెడల్స్ మరియు ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో బాలికలు బాలుర కంటే 11 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించడం ఆనందదాయకమని తెలిపారు. అదే సమయంలో బాలురు కూడా మరింత కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. తాను మొదట కర్నూలు జిల్లాకు పోస్టింగ్ వచ్చిన సమయంలో జిల్లాలో అక్షరాస్యత శాతం కేవలం 57 శాతమే ఉందని, అది చాలా తక్కువ స్థాయిలో ఉన్నదని గుర్తుచేశారు. జిల్లాలో ఏ పాఠశాలకు వెళ్లినా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఒకటే విషయం చెబుతానని, “విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి” అని పేర్కొన్నారు. విద్య ద్వారానే కుటుంబాలు, భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందుతాయని, మంచి విద్య ఉంటేనే మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్ లభిస్తాయని తెలిపారు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఆడపిల్లల విద్యపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపించాలని కోరారు. జిల్లాలో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను పదో తరగతి వరకు మాత్రమే చదివించి, ఇంటర్మీడియట్‌ను నామమాత్రంగా పూర్తి చేయించి వివాహం చేయాలని భావిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆడపిల్లలకు ఎంతవరకు చదివించగలరో అంతవరకు చదివించాలని, “పెళ్లి ఒక్కటే జీవిత లక్ష్యం కాదు” అని స్పష్టం చేశారు.పిల్లలతో సన్నిహితంగా మాట్లాడితే వారి సమస్యలను తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కుటుంబ సభ్యులతో చర్చించే వాతావరణాన్ని ఏర్పరచాలని సూచించారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాన్ని కేవలం మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలని . మంచి విషయాల కోసం ఉపయోగిస్తే సామాజిక మాధ్యమాలు విజ్ఞానం, కెరీర్ మార్గదర్శకత్వం అందిస్తాయని, చెడు కోసం ఉపయోగిస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలు 97.12 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 91.43 శాతం, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు 87.43 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 83.33 శాతం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 82.08 శాతం, ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలు 80.77 శాతం, ఏపీ మోడల్ స్కూల్స్ 79.08 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 60.63 శాతం, మున్సిపల్ హైస్కూల్స్ 58.50 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు 58.48 శాతం, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు 57.23 శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. మొత్తం జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం 71.8గా నమోదైందన్నారు.ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు, ఆదోని ఉప విద్యాశాఖాధికారి రాజేంద్ర ప్రసాద్, కర్నూలు ఉప విద్యాశాఖాధికారి శ్రీధర్ బాబు,  ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *