టిడిపీ చరిత్ర వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా నిలిచింది
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు.తెలుగుదేశం పార్టీ చరిత్ర వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా నిలిచిందని, అందుకే టీడీపీని వెన్నుపోటు పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమం ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై చర్చించడానికి కాకుండా, వైఎస్ఆర్సీపీ మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరిమితమైందని విమర్శించారు.వైఎస్ఆర్సీపీ గొడవలు, కక్షసాధింపుల రాజకీయాలు చేసే పార్టీ కాదని, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన పార్టీ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని అన్నారు.ఎన్నికల సమయంలో మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన టీడీపీ నాయకులు, మహానాడు వేదికగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారని అన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, విమర్శల రాజకీయాలను విడనాడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

