ఖరీఫ్ సీజన్‌లో రైతులు, కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
1 min read
రైతు సంఘం (సిపిఐ)
ప్యాపిలి (న్యూస్ నేడు) : ప్యాపిలి తాసిల్దార్ భారతి కి రైతు సంఘం, సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సిపిఐ మండల కార్యదర్శి మహేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికీ, రైతాంగానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సిపిఐ) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఖరీఫ్ ప్రణాళిక, విత్తన ప్రణాళిక, రుణ ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది.సాగునీటి విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ, కాలువల్లో పూడిక, తూటికాడ, గుర్రపుడెక్క పేరుకుపోవడం, గేట్లు తుప్పుపట్టి పనికిరాకపోవడం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల సాగునీటి సరఫరాపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని విమర్శించింది.రైతాంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడిలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సిపిఐ) సిద్ధంగా ఉందని హెచ్చరించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయాన్ని గాడిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకటెష్ పాల్గొన్న రైతులు సంజన్న రమేష్, కంబగిరి, రాము తదితరులు పాల్గొన్నారు.

