NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు సృజనాత్మక పోటీలు

1 min read

పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం – జూన్ 5న నిర్వహణ

పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ మరియు వాతావరణ మార్పుల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), కర్నూలు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ సృజనాత్మక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), కర్నూలు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబంధించిన పోస్టర్ ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జూన్ 5వ తేదీన నిర్వహించనున్న ఈ పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలు మరియు పర్యావరణ బాధ్యతాభావాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో పోస్టర్ & డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వం, రీల్/షార్ట్ వీడియో తయారీ, వ్యర్థ పదార్థాలతో వినూత్న వస్తువుల తయారీ, ఫోటోగ్రఫీ, సైన్స్ & ఇన్నోవేషన్ మోడల్, స్లోగన్ రచన వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “Inspired by Nature, For Climate, For Our Future” గా నిర్ణయించబడిన నేపథ్యంలో ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, పచ్చదనం పెంపు, కాలుష్య నివారణ మరియు సుస్థిర అభివృద్ధి అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పాల్గొనుటకు ధ్రువపత్రాలు (Certificates) అందజేయడంతో పాటు ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతలో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతాభావం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నమోదు ప్రక్రియ కోసం విడుదల చేసిన పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చని లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని, భావితరాలకు పరిశుభ్రమైన, హరితభరితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి విద్యార్థి తన వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో వెంకట రమణారెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *