మహిళల భద్రత, రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
1 min read
మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ దండయాన’
కోడుమూరులో “ఆపరేషన్ దండయాన” పోస్టర్లను ఆవిష్కరించిన…
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
కర్నూలు, న్యూస్ నేడు: మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల భద్రత మరియు చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన “ఆపరేషన్ దండయాన” కార్యక్రమంలో భాగంగా గురువారం కోడుమూరులోని ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆపరేషన్ దండయాన పోస్టర్లను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, నేరాల నివారణ మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మాట్లాడుతూ…మహిళలపై జరిగే నేరాల నివారణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని, ఏది నేరం, ఏది నేరం కాదనే విషయాలను తెలుసుకోవడం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా యువత, 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు పోక్సో చట్టం సహా వివిధ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.మహిళల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.ఎక్కడైనా నేరం జరిగినా లేదా నేరం జరిగే అవకాశం ఉందని భావించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.మహిళలకు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు, పేర్లు, ఫోన్ నంబర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మహిళలు మహిళా పోలీసు సిబ్బందికి కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, ఎటువంటి వేధింపులు లేదా సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయన్నారు.నేరం జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగల ధైర్యం, నమ్మకం ప్రజల్లో పెరగాలన్నారు. అలాగే సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందిస్తారనే విషయం కూడా తెలియాలన్నారుఈ కార్యక్రమంలో కోడుమూరు ఇంచార్జ్ ఎంపీడీఓ క్రిష్ణారెడ్డి, కోడుమూరు ఎమ్ ఈ ఓ రామచంద్రుడు, కోడుమూరు సీఐ తబ్రేజ్, కోడుమూరు ఎస్సై ఎర్రిస్వామి , సి. బెళగల్ ఎస్సై వేణుగోపాల రాజు, అర్సెలర్ మిట్టల్ / విండ్ పవర్ సంస్థ ప్రతినిధులు శ్రీధర్, శ్రీనివాస్, కిరణ్, పోలీసు సిబ్బంది, డ్వాక్రా , పొదుపు సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

