సర్ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలి – మాజీ ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: సర్ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి ఓటరు జాబితా రూపకల్పనలో కీలక పాత్ర పోషించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పార్టీ శ్రేణులకు సూచించారు. స్వర్గీయ తుగ్గలి ప్రతాపరెడ్డి ఆవరణంలో తుగ్గలి మండలానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ, సర్ కార్యక్రమంలో భాగంగా దాదాపు నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా, చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతిరోజూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు, న్యూట్రల్ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వారి వివరాలను సేకరించాలని, బూత్ లెవల్ అధికారులతో కలిసి సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని కోరారు.ఓటరు తొలగింపునకు సంబంధించిన ప్రతి క్లెయిమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు చేసే చిన్న పొరపాటు కూడా పార్టీకి తీరని నష్టం కలిగించే అవకాశం ఉన్నందున ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని శ్రీదేవమ్మ అన్నారు.ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల తాలూకా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

