కూటమి ప్రభుత్వం రాకతో రాయలసీమకు మంచి రోజులు
1 min read
పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాయలసీమ
రైజింగ్ రాయలసీమ- ఇండస్ట్రీ,ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కడపలోని జెడ్పీ హాలులో రైజింగ్ రాయలసీమ- ఇండస్ట్రీ,ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీ.వీ.ఎన్ మాధవ్, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎం.ఎల్.సి రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ఈ రెండేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. ఒక్క ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. రెండేళ్లలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీతో నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పెట్టుబడి గ్రౌండింగ్ అయ్యేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తామంతా ఈ కంపెనీల గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టామన్నారు. కడపలో జెఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిశ్రమ త్వరలో ప్రారంభమవ్వనుందన్నారు. అనంతపురంలో ఇప్పటికే కియా పరిశ్రమ ఉందని, అది కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు ఏ.ఎం.సీ.ఏ ( అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టు వచ్చిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటవుతోందన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రియలన్స్ కన్స్యూమర్స్ ప్రాజెక్టు ఓర్వకల్లులో పూర్తయిందన్నారు. త్వరలోనే ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇక కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎన్నో పరిశ్రమలు వస్తాయని, రాబోయే పదేళ్లలో ఏపీ దేశంలోనే టాప్‌లో ఉంటుందన్నారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఏపీపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో తాము ముందుకు వెళ్తున్నాం అన్నారు. గత ప్రభుత్వంలో ఒక ఎకరానికి అనుమతి పొందాలన్నా క్యాబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉండేదని, దీని వల్ల పారిశ్రామికవేత్తలకు పూర్తి ఇబ్బంది కలిగేదన్నారు. తాము వచ్చిన తర్వాత 50 ఎకరాల వరకు కింది స్థాయిలోనే అనుమతులు ఇచ్చే విధానం తీసుకొచ్చాం అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడితే బాగుంటుందన్న నమ్కం ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో కలిగించామని మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు.



