వ్యర్థాల విభజనతో ప్రజారోగ్యం – పర్యావరణ పరిరక్షణ
1 min read
‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో కలెక్టర్, డాక్టర్ ఏ.సిరి
ప్రజలు ఇంటి వద్దనే వ్యర్థాలను వేరు చేయాలి
బల్క్‌వేస్ట్ జనరేటర్లు వద్ద వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాలు తప్పనిసరి
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగర ప్రజలు తమ ఇంటి వద్దే వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక (హానికర) వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి తెలిపారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో వారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీవో సందీప్‌తో కలిసి ఆమె ఇంటి వద్దే వ్యర్థాల విభజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే బిర్లా కాంపౌండ్‌లో బల్క్ జనరేటర్ వద్ద ఉన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాన్ని, గార్గేయపురం డంప్‌యార్డులో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు.మద్దూర్ నగర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 ప్రకారం ఉత్పత్తి వద్దే వ్యర్థాల విభజనపై స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక వ్యర్థాలను నాలుగు వర్గాలుగా వేరు చేసి నగరపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను కలిపి ఇవ్వడం వల్ల పునర్వినియోగం, శాస్త్రీయ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, విభజించి ఇవ్వడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణానికి ప్రతి కుటుంబం భాగస్వామి కావచ్చని పేర్కొన్నారు.రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వద్దే వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగరపాలక పారిశుద్ధ్య విభాగ అధికారులు, సిబ్బంది ఇతర సంస్థలకు ఈ నమూనాలను చూపించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం వాల్‌మార్ట్ ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం గార్గేయపురం డంప్‌యార్డులోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టింగ్ యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) కేంద్రాలను పరిశీలించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా కంపోస్టు తయారీ, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 ప్రకారం నగరంలో అధిక మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, పెద్ద హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు తదితర సంస్థలు తమ వద్దే వ్యర్థాలను ప్రాసెస్ చేసి కంపోస్టుగా మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎస్‌ఈ రమణమూర్తి, డీఈఈ పవన్ కుమార్ రెడ్డి, ఏఈ వైష్ణవి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, ప్రజారోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


