NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలి

1 min read

కర్నూలు ఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు

ఈ నెల 15 నుంచి ఇంటింటికీ బీఎల్‌వోలు

అవసరమైన పత్రాలు ప్రజలు సిద్ధం చేసుకోవాలి

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్)ను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా అమలు నిర్వహించాలని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బీఎల్‌వోలకు ఎస్‌ఐఆర్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన విధివిధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ నెల 15వ తేదీ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, వాటిని ఓటరుచే స్వయంగా పూర్తి చేసి, అందులో ఒక ఫారంపై బీఎల్‌వో సంతకం చేసి రసీదు రూపంలో తిరిగి ఓటరుకు అందజేయాలని చెప్పారు.ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు అవసరమైన పత్రాలు, వివరాలను ప్రజలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా ఆర్వో పేర్కొన్నారు.ఓటర్లు తమ ఈపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు జాబితా వివరాలు (జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం నెంబర్, పార్ట్ నెంబర్, వరుస సంఖ్య), తల్లిదండ్రులు లేదా తాతలు, అమ్మమ్మలు, నానమ్మల ఈపిక్ కార్డులు అందుబాటులో ఉంటే మ్యాపింగ్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని వివరించారు.వివాహానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఇటీవల ఓటరుగా నమోదు చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను ముందుగానే సేకరించి ఉంచుకోవాలని సూచించారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా ప్రతి ఒక్కరూ బీఎల్‌వోలకు సహకరించి ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, మేనేజర్ జునైద్, సూపరింటెండెంట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author