జిల్లాలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ
1 min read
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాని మించిన మార్గం లేదు : జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం.
ప్రతి కుటుంబం యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి.
విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణకు యోగా దోహదపడుతుంది.
యోగా కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్.
కర్నూలు, న్యూస్ నేడు: యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.ఆదివారం స్థానిక ఎస్.ఏ.పీ క్యాంప్ మైదానంలో కలెక్టర్ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సెట్కూర్ సీఈవో డా.వేణుగోపాల్, జిల్లా పర్యాటక శాఖాధికారి లక్ష్మీ నారాయణ, జడ్పీ సీఈవో రమణా రెడ్డి, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా. ప్రసాద్, నోడల్ ఆఫీసర్ డా. అమర్నాథ్, రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, విద్యా సంస్థల అధినేత కె. వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టర్, ఎస్పీ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో ఎన్.సి.సి కాడెట్స్, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని, యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, మనిషి జీవనశైలిని సక్రమంగా తీర్చిదిద్దే సమగ్ర సాధనమని తెలిపారు. ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న ఒత్తిడులు, జీవనశైలి వ్యాధులు, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి యోగా అత్యంత ప్రభావవంతమైన మార్గమని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతికి దక్కిన విశిష్ట గౌరవమని పేర్కొన్నారు.ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక యోగా శిబిరాలు, అవగాహన సదస్సులు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించామని వెల్లడించారు.యోగాను ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు అభ్యసించడం ద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు మరియు వృద్ధులు యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎక్కువ సమయం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వినియోగంతో గడుపుతున్న నేపథ్యంలో శారీరక చలనం తగ్గిపోతున్నదని, ఈ పరిస్థితుల్లో యోగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంచుతుందని తెలిపారు. విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించడంలో యోగా విశేషంగా దోహదపడుతుందని వివరించారు.ప్రతి కుటుంబం రోజువారీగా యోగా సాధనకు కొంత సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లాలో గత 14 రోజులుగా సాగిన యోగా కార్యక్రమాలలో భాగంగా శానిటేషన్ వర్కర్స్ తో థీమాటిక్ యోగా నిర్వహించామని తెలిపారు. రాక్ గార్డెన్స్, కొండారెడ్డి బురుజు వంటి టూరిస్ట్ స్పాట్‌లలో 500 మందితో యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇదే కాకుండా ఆరు దేవాలయాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం యోగాకు సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించామని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5,34,000 మంది యోగాకు రిజిస్టర్ చేసుకుని, పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రజారోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, యోగా సాధన కూడా అందులో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చెబుతున్నదనే కాకుండా, ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని యోగాను జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.యోగాతో ఆరోగ్యం – ఆరోగ్యంతో ఆనందం – ఆనందంతో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని “నషా ముక్త్ భారత్ అభియాన్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


