యస్ఐఆర్ విధుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లపై పని ఒత్తిడి తగ్గించాలి
1 min read
విజయవాడ , న్యూస్ నేడు: యస్ఐ ఆర్ విధుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లపై పని ఒత్తిడి తగ్గించాలని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. అదనపు రాష్ట్ర ఎన్నికల అధికారి, సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని, గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బిఎల్ఓ తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, విఆర్ఓల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటలక్ష్మినారాయణ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిని, సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రతి బిఎల్ఓ సుమారు 800 మంది ఓటర్లను ఇంటింటికీ వెళ్లి కలవడం, గణన ఫారాలు ఇవ్వడం, వివరాలు సేకరించడం, కలర్ ఫోటోలు తీయడం, డిజిటలైజేషన్ చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేసేందుకు జూలై 15 వరకు ఉన్న గడువు సరిపోదని, ఆగస్టు 15 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఉద్యోగులను బిఎల్ఓ లుగా నియమించే అవకాశం ఉన్నా, ఏపీలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఓ లు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందినే వినియోగిస్తున్నారని తెలిపారు. సాధారణ విధులతో పాటు బిఎల్ఓ బాధ్యతల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.కొన్నిచోట్ల ఉన్నతాధికారులు టార్గెట్లు నిర్దేశించి షోకాజ్ నోటీసులు ఇవ్వడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి బిఎల్ఓ లపై ఒత్తిడి లేకుండా సర్ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. సర్ విధుల కాలంలో బిఎల్ఓ లకు ఇతర శాఖల విధుల నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని, గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచార సేకరణలో బిఎల్ఓ లపై దాడులు జరుగుతున్నాయని, విధులకు ఆటంకం కలిగించే వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. బిఎల్ఓ లు ఎవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏదైనా ఇబ్బంది ఉంటే జేఏసీ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తామని జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి బి.మధుబాబు భరోసా ఇచ్చారు.

