NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విపత్తు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

1 min read

జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల, న్యూస్​ నేడు : జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాన్ని జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తుల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల వల్ల ప్రజలకు, పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కుందూ నది నుంచి పాలేరు, మద్దిలేరు వాగుల ద్వారా వరద నీరు కాలనీలు మరియు గ్రామాల్లోకి ప్రవేశించకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బండ్లు, రక్షణ గట్లు బలోపేతం చేయాలని ఆదేశించారు. మహానంది మండలంలో పాలేరు వాగు వరదల కారణంగా సుమారు ఐదు ఎకరాల మేర పంట నష్టం సంభవిస్తున్న నేపథ్యంలో, కల్వర్టుల ఎత్తును పెంచి పొలాల్లోకి నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.అలాగే బనగానపల్లె మండలంలో లో- లెవల్ బ్రిడ్జిల వద్ద వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆత్మకూరు మండలంలోని నిప్పులవాగు, కొత్తపల్లి మండలంలోని ఎద్దులపల్లి వాగు, భవనాశి వాగుల పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో కూడా విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *