జొన్నగిరి బంగారానికి రాష్ట్ర మార్కెట్‌లో శ్రీకారం
1 min read
స్థానిక జ్యువెలరీ సంస్థలకు బంగారం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి అయిన బంగారాన్ని రాష్ట్రంలోని ప్రముఖ జ్యువెలరీ సంస్థలకు అందజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే ఉత్పత్తి అయిన బంగారం రాష్ట్ర వ్యాపారుల చేతుల మీదుగా వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనంగా నిలిచింది.జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో తవ్వకాల ద్వారా ఉత్పత్తి చేసిన బంగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వాసవీ జ్యువెలర్స్, సాయి సంతోష్ జ్యువెలర్స్, మధుమూర్తి జ్యువెలర్స్, ఎమరాల్డ్ జ్యువెలర్స్ సంస్థల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా జియోమైసూర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న బంగారాన్ని సాధ్యమైనంత వరకు రాష్ట్రంలోని జ్యువెలరీ వ్యాపారులకే విక్రయించాలని సంస్థ నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఖనిజ సంపద ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆదాయ వృద్ధికి కూడా తోడ్పాటునందుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ రాష్ట్ర ఖనిజ సంపదకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. గనుల రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజలో నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి అయిన బంగారం రాష్ట్రంలోని జ్యువెలరీ సంస్థలకు అందజేయడం ద్వారా “మన రాష్ట్రంలో ఉత్పత్తి – మన రాష్ట్రంలోనే విక్రయం” అనే భావనకు బలమైన పునాది పడిందని కార్యక్రమానికి హాజరైన అధికారులు, వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి.


