ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంతోనే న్యాయం..రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read
ఆర్యవైశ్యులు అవకాశాలు అందిపుచ్చుకోవాలి
తాడిపత్రిలో అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా, సీనియర్ నాయకులు జె.సి ప్రభాకర్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంలోనే పూర్తి న్యాయం జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తాడిపత్రిలో అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు మాజీ మున్సిపల్ ఛైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి సమక్షంలో నూతన కమిటీల ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కమిటీలు పదవులకు న్యాయం చేయాలని సూచించారు. ఇక కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పటికీ ఆర్యవైశ్యుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి తీసుకొని వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యుల కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని తనతో చెప్పినట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్.. ఆర్యవైశ్యుల తరుపున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.ఆర్యవైశ్యుల బ్లడ్‌లోనే సేవాగుణం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ పెట్టుబడులకు అనుబంధంగా ఎన్నో వ్యాపారాలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి తన సహకారం పూర్తిగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఓ పార్టీ తప్పుడు ప్రాచారాలు చేస్తోందన్నారు. ఆ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మొద్దని మంత్రి కోరారు. ఆ ఒక్క పార్టీకి ఆర్యవైశ్యులు దూరంగా ఉండాలని.. అప్పుడే జీవితంలో బాగుపడతామని అన్నారు. ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడా ఆర్యవైశ్యులకు మంత్రి పదవి లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులపై ఉన్న గౌరవంతో తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. గత ఎన్నికల్లో 95 శాతానికి పైగా ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత దక్కుతోందన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు ఎప్పటికీ ఉండాలన్నారు.ఇక ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా ఉండి ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యవైశ్య సంస్థలన్నీ కలిసి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కలిసి కట్టుగా నిర్వహించాలన్నారు. ఐక్యంగా ఉంటే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటున్నారన్నారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. డిసెంబర్ నెలలో బెంగుళూరులో గ్లోబల్ యాక్సిలరేటర్ విజన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొని ఆలోచనలు పంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవాధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సురేంద్రనాథ్ గుప్తా, తాడిపత్రి మార్కెట్ యార్డు ఛైర్మన్ భూమా నాగరాగిణి, ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి రంగనాథ్, పోతుల సురేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్దా సూర్య ప్రకాష్, వాసవి సేవాదళ్ అధ్యక్షుడు శబరి వరప్రసాద్, వాసవి సత్ర సమూదాయాల గౌరవాధ్యక్షులు సిద్దా నాగేశ్వరరావు, మహిళా విభాగ్ అధ్యక్షురాలు రజిని, తదితరులు పాల్గొన్నారు.


