రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు – మాన్వి దేవేంద్రప్ప
1 min read
సీఎం పర్యటన నేపథ్యంలో ఆస్పరిలో ప్రజావేదిక, సంజీవిని ఆసుపత్రి ఏర్పాట్ల పరిశీలన
ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో ఈ నెల 25న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పరిశీలించారు.ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సంజీవిని ఆసుపత్రితో పాటు కార్యకర్తల సమావేశం జరగనున్న ప్రజావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో రాయలసీమకు భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని అన్నారు. సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లాతో పాటు ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా రైతుల శాశ్వత సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేదవతి ప్రాజెక్టును వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మాన్వి దేవేంద్రప్ప పేర్కొన్నారు.


