NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నియోజకవర్గం ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుండి బయటకు తెచ్చేందుకు విశేషంగా శ్రమిస్తున్నాం

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే బడేటి చంటి

చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అందరి సహకారంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుండి బయటకు తెచ్చేందుకు విశేషంగా శ్రమిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూసేందుకు బృహత్‌ ప్రణాళికలను వివిధ శాఖల సమన్వయంతో సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈక్రమంలో ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరో ముందడుగు వేశారు. నిత్యం పెరుగుతోన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు అనువుగా ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ కార్పొరేషన్‌, పోలీసు, ఆర్టీసి అధికారులతో కలిసి గురువారం స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. ఇదేవిషయంపై అక్కడున్న షాపుల నిర్వాహకులతో కూడా ఆయన మాట్లాడారు. అలాగే కార్పొరేషన్‌కు సంబంధించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ శిథిలావస్థకు చేరడంతో దాన్ని వెనక్కి జరిపి పునర్నిర్మించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేషన్‌ అధికారులకు ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. దాంతో పాటూ పాతబస్టాండ్‌లోకి బస్సులు వచ్చి, వెళ్ళేందుకు ఉన్న ఇన్‌-అవుట్‌ గేట్‌లను ప్రయాణీకులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మార్చాల్సిన అవసరాలను ఆర్టీసి అధికారులకు ఆయన వివరించారు. అవసరమైన చోట్ల రహదారుల విస్తరణతో పాటూ డివైడర్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు. ఇక ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం కాకుండా చేపట్టాల్సిన చర్యలను కూడా పోలీసు, ట్రాఫిక్‌ అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అందరి పరస్పర అంగీకారంతో నగర సుందరీకరణతో పాటూ ట్రాఫిక్‌ సమస్యకు మోక్షం కల్పించేందుకు సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజల సౌకర్యార్థం చేపడుతోన్న చర్యలకు ప్రతిఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ కె.విజయరత్నం,ఈఈ వైవి కిషోర్‌ బాబూజీ,ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌ కుమార్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఏ.భానుప్రతాప్‌,ఎంఈ సురేంద్రబాబు,ఏలూరు ఆర్టీసి డిపో మేనేజర్‌ వాణి, 2టౌన్‌ సిఐ అశోక్‌ కుమార్‌, ట్రాఫిక్‌ సిఐ లక్ష్మణరావు,కో-ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, టీడీపీ సీనియర్‌ నాయకులు బెల్లపుకొండ కిషోర్‌ మరియు పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.

About Author