NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పాలన చేసే అర్హత లేదు: ఎమ్మెల్యే

1 min read

ఆస్పరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన – మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

ఆలూరు న్యూస్ నేడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పరి పర్యటనను నిరసిస్తూ ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికల సమయంలో సూపర్-6, సూపర్-7తో పాటు మొత్తం 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుపూర్తయినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని విమర్శించారు.ఈ రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధిని కాకుండా అబద్ధాల ప్రచారం, సంక్షేమం పేరుతో మోసం, రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచక పాలనను మాత్రమే చూసిందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను తలపించే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.ప్రజలపై రోజురోజుకు ఆర్థిక భారం పెరుగుతోందని, కరెంటు ఛార్జీలు, పెట్రోల్–డీజిల్ ధరలు, బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెరిగినా ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదని తెలిపారు. దీంతో ప్రతి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. డీఎస్సీ నిర్వహణలో అవకతవకలతో యువత భవిష్యత్తును దెబ్బతీశారని, సంక్షేమ హామీలను అమలు చేయకుండా ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రతి ఇంట్లో ప్రభుత్వ వైఫల్యాల గురించే చర్చ జరుగుతోందన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలు ప్రజల ఆవేదనకు ప్రతిబింబంగా నిలిచాయని పేర్కొన్నారు.ప్రజలను కొంతకాలం అబద్ధాలతో మోసం చేయవచ్చేమోగానీ ఎప్పటికీ మోసం చేయలేరని, ప్రజలు ప్రతి హామీని గుర్తుంచుకున్నారని అన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలబడతామని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author