వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా స్పందించని కూటమి ప్రభుత్వం
1 min read
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: సకాలంలో వర్షాలు కురవక ఆలూరు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి రైతు పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రైతు పొలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు రూ.2,000 చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలను కాపాడుకునే దుస్థితి నెలకొందన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంతో పాటు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు.రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం, కష్టకాలంలో రైతులను పూర్తిగా ఒంటరిగా వదిలేసిందని మండిపడ్డారు.వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, రైతులు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. కనీస మద్దతు ధర కూడా అందక రైతులు అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.వ్యవసాయానికి నీరు, ఎరువులు, గిట్టుబాటు ధరలు, పంటల రక్షణ వంటి కనీస అంశాలపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, రైతుల కష్టాలు మరింత పెరిగేలా పాలన సాగుతోందని విమర్శించారు.రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు. “రైతులారా… మీ కష్టాలు మాకు తెలుసు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతాం. మరో మూడేళ్లలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తిరిగి వస్తుంది. రైతులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతులను మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దింపుతారు” అని అన్నారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాభావ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని, ఎరువుల కొరతను వెంటనే నివారించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ మాజీ సభ్యులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


