NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

1 min read

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాల వైభవోపేత ఊరేగింపు

న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ పట్టణంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకార సేవలు, విశేష పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. “గోవిందా… గోవిందా…” నామస్మరణల మధ్య భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో మహిళలు హారతులతో స్వాగతం పలకగా, భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనంతో తమ జన్మ ధన్యమైందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవాదళం సభ్యులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author