మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
1 min read
రెండేళ్ల పాలనలో చరిత్రలో నిలిచేలా అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు
విద్య, ఉపాధి, సామాజిక భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం: టీడీపీ మైనార్టీ మండల అధ్యక్షులు ముల్లా మోయిన్
హోళగుంద న్యూస్ నేడు: మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగుదేశం పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు ముల్లా మోయిన్ అన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత, హజ్ సేవలు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రూ.16,147 కోట్లకు పైగా భారీ కేటాయింపులు
2024-25 నుంచి 2026-27 మధ్యకాలంలో మైనార్టీ సంక్షేమానికి రూ.16,147.23 కోట్ల భారీ నిధులు కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వం మైనార్టీల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందని ముల్లా మోయిన్ తెలిపారు. ఇప్పటికే రూ.9,759.70 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తూ మైనార్టీ కుటుంబాల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఎన్టీఆర్ భరోసాతో 3.38 లక్షల మందికి లబ్ధి
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సుమారు 3.38 లక్షల మంది మైనార్టీ లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించడం ప్రభుత్వ సంక్షేమ విధానానికి నిదర్శనమన్నారు. అలాగే 67,852 మంది విద్యార్థులకు విద్యా సహాయం, 10,543 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా విద్యార్థులు, యువత భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
మైనార్టీలకు చెందిన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముల్లా మోయిన్ తెలిపారు. ఇప్పటివరకు 1,500 వక్ఫ్ ఆస్తుల సర్వేలను పూర్తి చేయడం ద్వారా ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడుతూ వాటి ద్వారా మైనార్టీ సమాజానికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డిజిటల్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఈడీఎం ద్వారా డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణకు ప్రోత్సాహం అందించడం వల్ల యువతలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.అదేవిధంగా మైనార్టీ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, హజ్ యాత్రికులకు మెరుగైన సేవలు, ఉర్దూ భాష పరిరక్షణ, ఉర్దూ అకాడమీ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టడం మైనార్టీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు.
“విద్య – ఉపాధి – సామాజిక భద్రత – గౌరవం” లక్ష్యంగా పాలన
“విద్య – ఉపాధి – సామాజిక భద్రత – గౌరవం” అనే లక్ష్యంతో మైనార్టీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని ముల్లా మోయిన్ అన్నారు.‘స్వర్ణాంధ్రప్రదేశ్–2047’ లక్ష్య సాధనలో మైనార్టీలను భాగస్వాములను చేస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం సాగడం సంతోషకరమన్నారు. మైనార్టీ యువత విద్య, ఉపాధి రంగాల్లో ఎదగడానికి అవసరమైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.
అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు
మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైనార్టీ సంక్షేమ శాఖను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఉర్దూ భాష పరిరక్షణ, మైనార్టీ సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీలకు ముల్లా మోయిన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఆలూరు నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్లకు అభినందనలు తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి మైనార్టీలంతా అండగా నిలవాలి
మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి మైనార్టీ సోదరులంతా అండగా నిలవాలని ముల్లా మోయిన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.మైనార్టీల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మైనార్టీలు కీలక భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.


