సంగమేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి: ఎస్టీయూ
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) కడప జిల్లా అధ్యక్షుడు ఎన్. సంగమేశ్వర్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్యాపిలి ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మద్దిలేటి, బి.వై. మద్దిలేటి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీయూ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల కమిటీ కో-కన్వీనర్ వెంకట నాయక్ మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలు రాయడంలో ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంగమేశ్వర్‌రెడ్డి ప్రజాప్రతినిధులను కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యం చేశారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం తప్పుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు.ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. సంగమేశ్వర్‌రెడ్డిపై తప్పుడు కారణాలతో సస్పెన్షన్ విధించారని ఆరోపించారు.సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సస్పెన్షన్లు, కేసులకు ఎస్టీయూ భయపడబోదని నాయకులు స్పష్టం చేశారు.కార్యక్రమంలో సీనియర్ ఎస్టీయూ నాయకులు కిరణ్, ఆర్థిక కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


