కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి
1 min read
రైతులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, పంటల సాగులో ఎదురవుతున్న అనేక సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేసి, కర్నూలు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, అర్హత కలిగిన రైతులందరికీ తగిన పరిహారం అందించాలని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ అవసరాలను అందుబాటులో ఉంచడంతో పాటు సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతులపై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ నాయకులు కోరారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అధికార యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసి, ప్రతి మండలంలో పంట నష్టాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు.కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో హోళగుంద మండలం నుంచి సీపీఐ మండల కార్యదర్శి బి. మారెప్ప ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ నాయకులు వెంకన్న, సలాం, జాబ్, సుల్తాన్ వలి, యూసుఫ్, హరీష్‌తో పాటు మహిళా సంఘం నాయకులు జాహిదా, బసమ్మ, మీనాక్షి, వనజ, మున్నీ, షేకున్ బీ తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి మరిన్ని ఉద్యమాలు చేపడతామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


