కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
1 min read
పంట రుణాలను రద్దు చేయాలి-
కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి: సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్
న్యూస్ నేడు, పత్తికొండ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు పర్యటనలో భాగంగా గురువారం పత్తికొండ, దేవనకొండ మండల కేంద్రాల్లో ధర్నా నిరసన ర్యాలీ కార్యక్రమాలను చేపట్టారు. దేవనకొండ మండలంలోని నల్లచెలిమిల, ఎం కె.కొట్టాల, తువ్వదొడ్డి, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, చెల్లెలచెలిమెల,బేతపల్లి, బండపల్లి, పి. కోటకొండ ఈదుల దేవరబండ గ్రామాల్లో సిపిఎం బృందం సభ్యులు రైతుల పొలాల్లో పర్యటించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు లేక పంటలు పండక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమవుతాయన్నారు. తక్షణమే దేవనకొండను కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని మండలాల్లో వ్యవసాయ, రెవిన్యూ శాఖల సమన్వయంతో గ్రామాలను యూనిట్ గా చేసి కరువు అంచనా వివరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. రైతుల తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, పంటల బీమా పరిహారం విడుదల చేయాలని, కౌలు రైతులకు కరువు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, అంజిబాబు, ఆనంద్ బాబు , రంగారెడ్డి, దస్తగిరి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


