ఎల్లార్తిలో ఘనంగా 364వ గంధం ఉరుసు
1 min read
హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావలి సాహెబ్ దర్గాలో భక్తుల కోలాహలం
భక్తిశ్రద్ధలతో గంధం సమర్పించిన భక్తులు
హోళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామంలోని హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావలి సాహెబ్ దర్గాలో 364వ గంధం ఉరుసు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉరుసు సందర్భంగా దర్గాను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఉరుసులో భాగంగా ముజావర్ అబ్దుల్ రాహుప్ సాబ్ ఇంటి నుంచి సయ్యద్ నూర్ బాబా గంధాన్ని భక్తిశ్రద్ధలతో మోసుకొని ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. అనంతరం గంధాన్ని హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావలి సాహెబ్‌కు సమర్పించారు. గంధం సమర్పించే కార్యక్రమాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఎల్లార్తికి చేరుకున్నారు.గంధం ఊరేగింపు సందర్భంగా భక్తులు కాకడలతో పాటు డప్పులు, డ్రమ్స్ వాయిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటుకున్నారు. ఫకీర్ స్వాముల సందడి, భక్తుల నినాదాలు, డప్పుల మోతతో దర్గా పరిసర ప్రాంతం కోలాహలంగా మారింది. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.364వ గంధం ఉరుసు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్గాకు వచ్చిన భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఉరుసు వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఎల్లార్తి దర్గాలో ప్రతి సంవత్సరం నిర్వహించే గంధం ఉరుసుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఈ ఉరుసులో హిందూ, ముస్లిం భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని చాటుకోవడం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉరుసు వేడుకలు భక్తి, ఆధ్యాత్మికత, సోదరభావంతో అంగరంగ వైభవంగా జరిగాయి.



