గత వైసీపీ ప్రభుత్వంలో యువత తీవ్రంగా నష్టపోయారు.. కర్నూలు ఎంపీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికే సుమారు 7 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి, ఉపాధ్యాయ నియామక పరీక్ష కి మధ్య ఉన్న తేడా తెలియని జగన్, డీఎస్సీ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు.యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొంది సొంతంగా పరిశ్రమలు, స్టార్టప్ లు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. కర్నూలులో త్వరలో ఐటీ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.రాయలసీమ ప్రాంతంలో మహిళా విద్యార్థినులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు మరియు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, రాయలసీమలోనే టాప్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలగా నిలుస్తున్న అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ డా. హరీష్ కృష్ణ గారు, ప్రిన్సిపాల్ డా. నవీన్ , అధ్యాపకులు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



