నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీ మరియు పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బంగారుపేటలో మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 300 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే సుమారు 10 లీటర్ల నాటుసారాను అక్కడే నశింపు చేయడం జరిగినది అని తెలిపారు. నాటుసారా తయారీకి పాల్పడిన వ్యక్తుల వివరాలపై విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.అనంతరం మునుగాలపాడులో కూడా నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి, సుమారు 200 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు.ఈ దాడుల్లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ మారుతి ప్రసాద్, ట్రైనీ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.అక్రమ మద్యం తయారీ, రవాణా మరియు నాటుసారా విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


