NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల విధుల్లో అప్రమత్తత, నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ అత్యంత కీలకం

1 min read

పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించి, ప్రతి అంశాన్ని నమోదు చేయాలి

మైక్రో అబ్జర్వర్లకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి దిశానిర్దేశం

కర్నూలు, న్యూస్ ​నేడు: పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు  అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు.శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్నికల విధులు, బాధ్యతలు, అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….పోలింగ్ ప్రారంభానికి ముందు బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని పోలింగ్ ఏజెంట్లకు చూపించడం, నిబంధనల ప్రకారం పేపర్ సీల్ వేయడం, అవసరమైన సంతకాలు తీసుకోవడం, ఓటింగ్ రహస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించడం వంటి అంశాలను గమనించాలని కలెక్టర్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారి తన విధులను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అన్నది పరిశీలించడమే మైక్రో అబ్జర్వర్ల ప్రధాన బాధ్యత అని తెలిపారు. 

పరిష్కరించలేని విధులపై స్పష్టత ఉండాలి 

మైక్రో అబ్జర్వర్లకు అందించిన శిక్షణ  సమాచారం లో విధులు, బాధ్యతలు, ఎన్నికల సమయంలో గమనించాల్సిన అంశాలు  ఉన్నాయని, వాటిపై పూర్తిగా అధ్యయనం చేసి స్పష్టత తెచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించాలని,  రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని కూడా పరిశీలించాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు తమకు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా, అప్రమత్తతతో నిర్వర్తించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్  కోరారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహా రెడ్డి, సి.పి. వో భారతి, ఎల్.డి.ఎం పి. మోహన్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *