మధుమేహ బాధితుల్లో పీఏడీపై అవగాహన అవసరం
1 min read
అవగాహన లేకుండా చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే కాలు కోల్పోయే ప్రమాదం
సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ముప్పును నివారించవచ్చు: డా. శ్రీకాంత్ రాజు
కర్నూలు, న్యూస్ నేడు : మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గించే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) సమస్యపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ యూనిట్) సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డా. ఎస్. శ్రీకాంత్ రాజు అన్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మధుమేహ బాధితుల్లో పీఏడీ సమస్య వేగంగా పెరుగుతోందని, వీరిలో రక్తనాళాల సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. చిన్నపాటి గాయాలు సైతం త్వరగా మానకపోవడంతో పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్యల కారణంగా కొంతమందికి గాయాల వల్ల కలిగే నొప్పి కూడా తెలియకపోవచ్చని వివరించారు.నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు ఏర్పడటం, కాలి వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.సకాలంలో రక్తప్రసరణ పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని తెలిపారు. మధుమేహ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పొగతాగడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి మందులతో పాటు యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.ప్రతి రోజూ పాదాలను పరిశీలించుకోవాలని, చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. పీఏడీపై ముందస్తు అవగాహన, వ్యాధిని సకాలంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా కాలు కోల్పోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని డా. శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ డీజీఎం సంతోష్ కుమార్, మేనేజర్ పాల్గొన్నారు.


