తాగునీటి మోటార్ల కేబుల్స్ దొంగిలిస్తే కఠిన చర్యలు
1 min read
కేబుల్స్ కొనుగోలు చేస్తే గుజిరి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవు
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే మోటార్లకు సంబంధించిన విద్యుత్ కేబుల్స్‌ను కొందరు దుండగులు కట్ చేసి దొంగిలిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. తాగునీటి సరఫరాకు వినియోగించే మోటార్ల కేబుల్స్‌ను దొంగిలించడం వల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే కేబుల్స్ దొంగతనాలకు సంబంధించి ఉల్లిందకొండ, 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశామని తెలిపారు. ముఖ్యంగా గుజిరి వ్యాపారులు దొంగిలించిన కేబుల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా దొంగిలించిన కేబుల్స్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తుల వ్యాపారాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా కేబుల్స్ విక్రయించేందుకు వస్తే వెంటనే నగరపాలక సంస్థ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు.


