కూటమి ఎంపీ టిక్కెట్‌కు…పోటీ తీవ్రం..!
1 min readఎంపీ డా. సంజీవ్ కుమార్ చేరికతో… ఆశావహుల్లో టెన్షన్..
- రేసులో డా. చంద్రశేఖర్, కురువ భాను శంకర్, పంచలింగాల నాగరాజు..మరికొందరు
- పక్కా వ్యూహంతో… అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్ఠానం
- ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలు..
- ప్రజా సర్వే ఆధారంగానే.. ఎంపీ టిక్కెట్ ఖరారు..
రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయం…రసవత్తరంగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం ఆచి..తూచి అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యావంతులు… ప్రజా సేవకులకే టిక్కెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సర్వేలపై… సర్వే చేయిస్తూ… రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటోంది. కర్నూలు (బీజేపీ–జనసేన–టీడీపీ) కూటమి ఎంపీ టిక్కెట్ కోసం వైద్యులు, ఉన్నత విద్యావంతులు, మేదావులు, రాజకీయ నేపథ్యం ఉన్న వారు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ డా. సంజీవ్ కుమార్ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశం పార్టీలో చేరడంతో.. ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం.. ఎవరికివారు పావులు కదుపుతుంటే… డా. సంజీవ్ కుమార్ చేరికతో… పాచిక తిరగబడినట్లయింది.
కర్నూలు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో (టీడీపీ–జనసేన–బీజేపీ) నంద్యాల, కర్నూలు కూటమి ఎంపీ టిక్కెట్ ఆశించే ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. టీడీపీ అధిష్టానం రెండో జాబితాను విడుదల చేసినా… అందులో ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. గురువారం వైసీపీ కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశం పార్టీలో చేరడంతో … ఆశావహుల్లో ఉత్కంఠకు తెరలేపింది. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు టిక్కెట్ పై స్పష్టమైన హామీతోనే టీడీపీలో చేరి ఉంటారని టీడీపీ వర్గీయుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఆశావహుల్లో.. ఉత్కంఠ…:
కర్నూలు ఎంపీ టిక్కెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు వ్యూహాత్మకంగా పెరుగుతోంది. విద్యావంతులు, మేధావులు, వైద్యులు, వ్యాపారులు.. ఇలా అన్ని రంగాల వారు ఎంపీ టిక్కెట్ ఆశిస్తుండటంతో.. ( బీజేపీ–జనసేన– టీడీపీ) కూటమి అభ్యర్థి ఎంపికలో అధిష్టానం తలమునకలవుతోంది. చివరి దాకా కర్నూలు ఎంపీ టిక్కెట్‌ను ప్రకటించే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠకు దారి తీసింది.
క్యూలో… గెలుపు గుర్రాలు..:
అధికార వైసీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్‌ను మేయర్ బి.వై. రామయ్య వాల్మీకి ఇవ్వడంతో… టీడీపీ అధిష్టానం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తూ ఉంది. సరైన సమయంలో… ధీటైన వ్యక్తిని బరిలో నింపేలా.. టీడీపీ అధిష్ఠానం సమాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి డా. పార్థసారధి, టీడీపీ నుంచి డా. సంజీవ్ కుమార్, డా. చంద్రశేఖర్ యాదవ్, పంచలింగాల నాగరాజు, కురువ భాను శంకర్, సత్రం రామకృష్ణుడు వాల్మీకి ఎంపీ టిక్కెట్ రేసులో ఉన్నారు.
పదునెక్కిన…వ్యూహం…:
ఎంపీ టిక్కెట్ కోసం ఎవరికి..వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ… పార్టీ పెద్దల మెప్పు కోసం పావులు కదుపుతున్నారు. వైసీపీ టిక్కెట్ వాల్మీకి వర్గానికి ఇవ్వడంతో… టీడీపీ కురువు, యాదవ సామాజిక వర్గానికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ చేనేత వర్గానికి చెందిన డా. శింగరి సంజీవ్ కుమార్ టీడీపీలో చేరడంతో …. శరవేగంగా సమీకరణాలు మారాయి. స్పష్టమైన హామీతోనే … పక్కా ప్లాన్‌తో టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది.