మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9552300009
1 min read
ప్రతి పౌరుడు చరవాణిలో మన మిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు సేవ్ చేసుకోండి
ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం అధికారిక వాట్సాప్ నంబర్ 95523 00009 ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 254కి పైగా సేవలు అందిస్తుందన్నారు. జూన్ నెలకు 500కు పైగా సేవలందించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తదుపరి దశలో వెయ్యికి పైగా సేవలందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ గవర్నెన్స్ ను ఐటీ, రియల్ టైం గవర్నెన్స్ శాఖ అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లో మనమిత్ర పేరిట 95523 00009 అనే నంబర్‌ను సేవ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చదువురాని వారు కూడా కేవలం వాయిస్ మెసేజ్ ద్వారా కూడా పనిచేసేలా చాట్ బాట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునేలా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చన్నారు. ప్రస్తుతం తెలుగు, ఆంగ్ల భాషల్లో సేవలందిస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకొచ్చేందుకు ఇంటింటికి కరపత్రాలను కూడ పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పౌరులు ఇంటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఒకే వాట్సప్ మెసేజ్ తో పౌర సేవలను అందుబాటులోకి తీసుకొని రావడమే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్,, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే విద్యుత్తు బిల్లులు. ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రిఫండ్, పీడ్‌బ్యాక్ తదితర సేవలు వాట్సప్ ద్వారా పొందవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.