మత్స్యకారులకు ఆర్థిక సాయం పెంపు..
1 min read
వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
- రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు : ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క హామీని తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచి విడుదల చేయడం జరిగిందని ఒక ప్రకటన ద్వారా మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా అని ఆయన ప్రశ్నించారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిందని.. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని తెలిపారు. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నామని, మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నామన్నారు. అంతేకాకుండా వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటోందన్నారు. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినాలని మంత్రి పేర్కొన్నారు.