ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి సహకరించండి..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను స్థాపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను.. మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. టమోటా పంటను అధికంగా పండిస్తున్న రాయలసీమ జిల్లాల్లో ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద మొదటి విడత రెండవ విడత మొత్తo రూ. 9.76 కోట్లు విడుదల చేయాలని మంత్రి టి.జి భరత్ కోరారు. ఆరు నెలల్లోపు మొత్తం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయడానికి మిగిలిన గ్రాంట్ మొత్తం రూ. 34.17 కోట్లు విడుదల చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. రాయలసీమ జిల్లాల్లో రైతులు టమోటా పంటను అత్యధికంగా సాగు చేస్తారని కేంద్ర మంత్రికి వివరించారు. టమోటా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటుచేయడం ద్వారా పంట కోత తర్వాత నష్టం జరగకుండా చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతానికి ఈ కేంద్రాలు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నారు.ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్.. కేంద్ర మంత్రికి వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీఎంకేఎస్‌వై స్కీమ్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలనుకునే వారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా నేరుగా అప్లై చేసుకునేలా ఏపీకి వెసులుబాటు కల్పించాలని మంత్రి టి.జి భరత్ కోరారు. ఇప్పుడున్న ప్రక్రియ పెట్టుబడుల ప్రతిపాదనలను సకాలంలో సమర్పించడానికి ఒక అడ్డంకిగా ఉందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఎంతో దోహదపడే ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటీలో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద రూ. 2.67 కోట్ల గ్రాంట్‌తో స్థాపించిన ఇంక్యూబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబందించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు.