ఆర్డిటి సేవలను కొనసాగించాలని ఆర్డిఓ కార్యాలయ ఏవో కు వినతి
1 min read
వినతి పత్రం అందజేసిన సిపిఐ మండల సమితి
పత్తికొండ న్యూస్ నేడు : ఏపీలో ఆర్డిటి సేవలను కొనసాగించాలని కోరుతూ బుధవారం స్థానిక సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో ఏవో సుదర్శన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ గురుదాస్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం కారన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ మండల కార్యదర్శి కే సిద్దు, పెద్దహుల్తి సిపిఐ శాఖ కార్యదర్శి ఎం రాజప్ప తో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి డి .రాజా సాహెబ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే అనేక గ్రామాలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఓ కల్పతరువు వంటిదని, ఆర్డీటీకి ఒక మతం, ఒక ప్రాంతం అనేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా పేదల అభ్యున్నతి కోసం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. ఐదున్నర దశాబ్ధాలుగా మానవత్వంతో సేవలు అందిస్తున్న ఆర్డీటీ నేడు ప్రమాదంలో పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్) రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్డీటీ సేవలు సజావుగా సాగేలా చూడాలని తెలిపారు. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.