PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతు సంఘం హర్షం

1 min read

రాజకీయాలకు అతీతంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలి

 గోదావరి,కృష్ణా డెల్టాల కాలువలను ఆధునికరించాలి

 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడిలో రైతుల సమావేశం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం బొమ్మిడిలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతులు, కౌలు రైతులు హర్షం వ్యక్తం చేశారు.  గురువారం బొమ్మిడి సహకార సొసైటీ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని, అయితే రాజకీయాలకు అతీతంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని కోరారు. గోదావరి, కృష్ణా డెల్టాల కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయింపు చేసి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పరిధిలో కృష్ణా,గోదావరి డెల్టాల ఆయకట్టు భూములు శివారు ప్రాంతం కావడంతో సక్రమంగా సాగునీరు అందడం లేదన్నారు. ముంపుకు ముందు సాగునీరు అందడానికి వెనుక అన్న విధంగా ఉండడంతో అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కౌలు రైతులందరికీ పంట సాగుదారు హక్కు పత్రాలు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ -క్రాప్ బుకింగ్ లో వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేయాలన్నారు.టార్ఫాలిన్లు, స్ప్రేయర్లు వంటి చిన్న వ్యవసాయ యాంత్రిక పరికరాలను కౌలు రైతులకు, పేద రైతులకు 50% సబ్సిడీపై అందించాలనిడిమాండ్ చేశారు.గుండుగొలను డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుత్తికొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో కాలువలపై తూములు ఏర్పాటు చేసి వంద సంవత్సరాలకు పైగా అయిందని చెప్పారు. ఈ తూములను ఆధునికరించాలని కోరారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు,దుడే కేశవ, వానపల్లి సత్యనారాయణ, దుడే రాంబాబు, నక్కా ధనుంజయరావు,మారిశెట్టి లక్ష్మీనారాయణ పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.

About Author