వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి
1 min read

మీడియా సమావేశంలో మండిపడిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్లోని వైఎస్సార్సీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు. మౌర్య ఇన్‌లోని రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కార్యాలయంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్లు పరమేష్, లతీఫ్, జకియా అక్సారీ, పద్మలతా రెడ్డి, ఫరాజ్ ఖాన్, క్రాంతి కుమార్, రవణమ్మ, నాయకులు మెహబూబ్ ఖాన్, అబ్బాస్, తదితరులు మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం నగరంలోని 10వ వార్డు టిడిపి ఇంచార్జి మెహబూబ్ ఖాన్‌పై.. వైసీపీ కార్పొరేటర్ యూనుస్, జావీద్‌లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి టి.జి భరత్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యలు చేయడంపై వీరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్వీ మోహన్ రెడ్డి యే రౌడీలను తయారుచేస్తున్నారన్నారు. రౌడీయిజం చేస్తున్న కార్పొరేటర్ యూనుస్‌ను మందలించాల్సిందిపోయి.. మంత్రి టి.జి భరత్‌పై బురదజల్లడం సరైంది కాదన్నారు. వైసీపీ వార్డు కార్యాలయాన్ని వాళ్లే ధ్వంసం చేసుకొని మాపై నిందలు వేస్తున్నారని అన్నారు. కర్నూలును పద్దతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళుతుంటే దాడులతో అడ్డుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఏడాదిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి ఎంతో చేశారన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ నేతలు తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి టి.జి భరత్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి టి.జి భరత్.. పార్టీలతో సంబంధం లేకుండా కర్నూలును అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ సత్తా చాటిందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు.

