ప్రతి వీధిలో పారిశుద్ధ్య సిబ్బంది వివరాలు
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రజలకు అందుబాటులో సులభమైన సమాచార వేదిక
మెరుగైన పారిశుద్ధ్యానికి వినూత్న కార్యాచరణ
కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం కర్నూలు నగరాన్ని రాష్ట్రంలోనే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ప్రత్యేక అడుగులు వేస్తోంది. అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కమిషనర్ పి.విశ్వనాథ్, తాజాగా మరో వినూత్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు.ప్రతి వీధిలో పారిశుద్ధ్య సేవలు మరింత సమర్థవంతంగా జరిగేలా స్థానికులకు పారిశుద్ధ్య సిబ్బంది వివరాలు, ఫోన్ నంబర్లు, చెత్త సేకరణ సమయాలు వంటి సమాచారం అందుబాటులో ఉంచుతూ ప్రత్యేక వాల్ పెయింటింగ్ కార్యక్రమం ప్రారంభించారు.కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందుతోంది. నగరంలోని అన్ని వీధుల్లో వాల్ పెయింటింగ్‌ల రూపంలో ఈ సమాచారం ఉంచడం ద్వారా ప్రజలకు తక్షణ సౌకర్యం లభిస్తోంది.ఈ వాల్ బోర్డుల ద్వారా ప్రజలు తమ ప్రాంతానికి బాధ్యత వహించే పిహెచ్ వర్కర్లను నేరుగా సంప్రదించి పారిశుద్ధ్య సేవల గురించి తెలుసుకోవచ్చు. ఒకవేళ వారి స్పందించకపోతే శానిటేషన్ కార్యదర్శి, శానిటేషన్ ఇంస్పెక్టర్‌లను ఫోన్ చేసే వెసులుబాటు సైతం కల్పించారు. ఎక్కడైనా చెత్త పేరుకుపోవడం లేదా పారిశుద్ధ్య లోపం గమనించినప్పుడు, ఈ ఫోన్ నంబర్ల ద్వారా సమాచారమివ్వడం ద్వారా సమస్యలు తక్షణ పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు చెత్తా సేకరణ, వారానికి ఒకసారి పూడికతీత పనులు అనే వివరాలు కూడా స్పష్టంగా ఇచ్చారు.దీనిపై కమిషనర్ పి. విశ్వనాథ్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే శుభ్రమైన నగరం సాధ్యమని, ప్రతి వీధిలో ఈ వివరాలు అందుబాటులో ఉండటం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు . ప్రజలు సహకరించి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్త ఎక్కడబడితే అక్కడ పోయకుండా నగరపాలక వాహనాలకే అప్పగించాలని కోరారు. స్వచ్ఛతలో పైచేయి సాధించేందుకు ప్రతి పౌరుడు కలిసిరావాలని, స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ‘శుభ్రంగా, అందంగా, ఆరోగ్యకరంగా’ అనే లక్ష్యంతో ముందుకు సాగుతూ, ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యే ఈ వినూత్న పారిశుద్ధ్య సమాచార సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు.

