పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి:కలెక్టర్
1 min read
ముచ్చుమర్రి-ఓర్వకల్ పనులను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి..
నందికొట్కూరు న్యూస్ నేడు: ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ వరకు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న త్రాగు నీటి పైప్లైన్ ప్రాజెక్టు పనులను నిర్దేశించిన గడువులోగా పనులను త్వరగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ వరకు జరుగుతున్న నీటి పైప్లైన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ప్రాజెక్టు పనుల పురోగతి,పైప్లైన్ ఏర్పాటు, నిర్మాణ నాణ్యత,సాంకేతిక అంశాలు,ఎదురౌతున్న సమస్యల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పనుల అమలులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దశను పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరా మరియు పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ప్రాజెక్టును నాణ్యతగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్
నందికొట్కూరులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రాజెక్టు పురోగతిపై శాఖల వారీగా సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వాటి పూర్తి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.పనుల అమలులో ఎదురౌతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైప్లైన్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడంతో పాటు భద్రతా నిబంధనలను కూడా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రాజెక్టు పూర్తయితే సంబంధిత ప్రాంతాలకు నీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి,ఆర్డీఓ వెంకట శివ,మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,పట్టణ సీఐ ఎన్ అశోక్ కుమార్,తహసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

