ధార్మిక జీవన మార్గదర్శిని భగవద్గీత
1 min read

మండల విద్యాధికారి హెచ్. రఘునాయక్
భక్తిశ్రద్దలతో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు
కర్నూలు, న్యూస్ నేడు: మానవాళి వ్యక్తిత్వ వికాసానికేకాకుండా ధార్మిక జీవన మార్గాన్ని చూపే గొప్ప గ్రంథం శ్రీమద్భగవద్గీత అని, దాన్ని చదవటము, అవగాహన చేసుకోవటము, జీవితానికి అన్వయం చేసుకోవడం ద్వారా జీవన్ముక్తులవుతారని, ఆదర్శవంతమైన సమాజరూప కల్పనకు తోడ్పడుతారని డోను మండల విద్యాధికారి2 హెచ్. రఘునాయక్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగవద్గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం నంద్యాల జిల్లా స్థాయి భవద్గీత కంఠస్థ పఠన పోటీలు డోన్ పట్టణంలోని శ్రీ సుధ బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు.ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయము గుణత్రయవిభాగయోగము ఒక విభాగంగా, 10వతరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగం ఒక విభాగగా, 18 నుంచి 45 సంవత్సరంలలోపు వారికి ‘నిత్య జీవితంలో భగవద్గీత-భావ విశ్లేషణ’ పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి మరియు స్వచ్ఛందంగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల విభాగంలో బి.సుస్మిత, ఎస్.నాగసాయి చతురశ్రీ, సి.గీతికలు; 10వతరగతి- ఇంటర్మీడియట్ విభాగంలో జి.బి. అవినాశ్, సాయి కార్తీక్, జి. షణ్ముఖసాయిలు, 18 నుంచి45 సంవత్సరాలలోపు విభాగం వారిలో జె. దీపిక, ఎ.సునీల్ కుమార్, కె. చంద్రబాబు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానములు నుండి జ్ఞాపిక, ప్రశంసా పత్రము మరియు నగదు బహుమతులను అందించారు. బహుమతి ప్రధాన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి2 చే అందించారు. న్యాయ నిర్ణేతలుగా జిల్లా విశ్రాంత న్యాయాధికారి కాశీభట్ల శివ ప్రసాద్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గొల్ల శివన్న, అద్యాపకులు ఎస్. వరలక్ష్మీ, డాక్టర్ దేవి దయానంద్ సింగ్, డాక్టర్ తొగట సురేశ్ బాబు, పసుపులేటి నీలిమ, ఎం.శ్రీసుధ, జి.వనజ కుమారి, జి.భానోజీ రావు, పాల్గొన్నారు. విశ్రాంత జిల్లా న్యాయాధికారి కాశీభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ జాతి, కుల, మత, వర్గ, వివక్ష లేకుండా సర్వమానవాళికి జీవన్ముక్తులయ్యే మార్గాన్ని ప్రసాదించేటువంటి గ్రంథం భగవద్గీత అని, అది భారతీయ సనాతన ధార్మిక సాంప్రదాయాల మూలకందమని, భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం లాంటి వారి జీవన సహచరిఅని, గీతా ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో, ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని కలిగించేందుకు దేవస్థానం చేపడుతున్న కార్యక్రమాల్లో భవద్గీత జయంతి ఉత్సవాలు ఒక భాగమని, ఇందులో విద్యార్థులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని అందరూ ధార్మిక ప్రవృత్తిని అలవర్చుకొని మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని, విశ్వ కళ్యాణ కారకమైన భారత సనాతన సంస్కృతి వ్యాప్తికి ఇతోధికంగా అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ ఎ.మరిచార్లిస్, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతోపాటు విద్యార్దుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా శ్రీమద్భగవద్గీత మరియు శ్రీకృష్ణ భగవానుడి చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

