శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ స్పెషల్ క్యాంపు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల సమీపంలోని వడ్డుగండ్ల గ్రామం నందు రెండవ రోజు స్పెషల్ క్యాంపు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యర్థ పదార్థాలను నివారించి వాటిని తడి చెత్త మరియు పొడి చెత్తగా విభజించడం, పరిశుభ్రత మొదలగు వాటిపై ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు సూచించినట్లు తెలియజేశారు. వ్యర్థాలను వేరు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని, భూమిలో కలిసే చెత్త పరిమాణం తగ్గడం వలన వ్యర్థాల నుండి వనరులను తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రీసైక్లింగ్ రేటును మెరుగుపరచడం మరియు ఆరోగ్యకరమైన వాతావరణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, ఇంచార్జ్ శ్రీహరి, నీటి సంఘం ప్రెసిడెంట్ మోహన్ కుమార్, మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

